AP Rains: తూర్పుగోదావరి  జిల్లా మన్యం ప్రాంతంలో కుండపోత

 నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ద్రోణుల ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా మన్యం ప్రాంతంలో  కుండపోత వాన కురుస్తుంది. వారం రోజుల  భారీ వర్షాలు పడుతున్నాయి.  శుక్రవారం ( జులై 12)  రాత్రి నుంచి రోజంతా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. ఈశాన్య అస్సాం, పశ్చిమ అస్సాం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకూ రెండు వేర్వేరు ద్రోణులు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రానున్న ఐదు రోజుల ( జులై 15 నుంచి) పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అమరావతి  వాతావరణశాఖ హెచ్చరించింది.

 రాజమహేంద్రవరం అర్బన్‌, రూరల్‌, రాజానగరం, గోకవరం, కోరుకొండ తదితర మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక రోడ్లపై నీరు నిలిచిపోవడం.. ఆగకుండా వాన కురుస్తుండటంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. చిరు వ్యాపారులు ఇబ్బందులకు గురయ్యారు. రాజమహేంద్రవరం నగరంలోని పలుచోట్ల వాన నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనచోదకులు ఇక్కట్లు పడ్డారు. తాళ్లపూడి మండలంలో  శనివారం ( జులై 13) 1.4 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బిక్కవోలులో 3.2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. తూర్పుగోదావజిల్లా లో ఎవరేజ్‌న 23.4మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. పాడేరు మన్యంలో కూడా  మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నారుమడుల్లో వేసిన వరి విత్తనాలు వరద నీటికి కొట్టుకుపోయాయి.  పంటలు మునిగిపోకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.